ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతలద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. రహదారులపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఉదయాన్నే కార్యాలయాలకు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే.. వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, ముసారాంబాగ్, మలక్ పేట, ఖైరతాబాద్, లక్డీ కా పూల్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ జలమయమం కావడంతో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ఏ నాళా ఉందో అర్థం కాని పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దే ఉంచుతున్నారు. భారీ వర్షంతో పంజాగుట్ట, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షంలోనే వాహనదారులు ఎదురుచూస్తూ తడిసిముద్దవుతున్నారు.
సోమవారం రోజున కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు భగభగలాడిస్తే.. మరికొన్ని ప్రాంతాలను వరణుడు వణికించాడు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా బంట్వారం(వికారాబాద్ జిల్లా)లో 9.3, హైదరాబాద్‌లోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ వద్ద 8.4, వెస్ట్ మారేడ్‌పల్లిలో 8.1, మధుసూదన్‌నగర్‌లో 6.9, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 5.9, వరంగల్ జిల్లాలోని పైడిపల్లిలో 6.4, జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారంలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.