భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరాన్ని వణికిస్తున్నాయి. ఏకధాటిగా దంచికొడుతున్న వానతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని రహదారులన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వర్షం వల్ల నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైబర్ టవర్ నుంచి కేపీహెచ్ బీ కి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ వల్ల గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు హైటెక్ సిటీ జేఎన్టీయూ రహదారిలోనూ వాహనాలు నిలిచిపోయాయి. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే చాలా సేపటి వరకు వేచిచూశారు. వర్షాలు కురుస్తుండటం వల్ల ట్రాఫిక్ ను క్లియర్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు కాస్త కష్టంగా మారింది. ఎట్టకేలకు గంట సేపటి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది.
ఏకధాటి వానతో పాతబస్తీ, నారాయణగూడ దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాంపల్లి ఏరియాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగి ప్రభావిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారంబాగ్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించి…. గోల్నాక వైపు కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మలక్ పేట వంతెన కింద భారీగా వర్షపు నీటితో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దిల్‌షుక్ నగర్ ప్రాంతంలోని అనేక కాలనీలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్‌నగర్ చెరువుకు దిగువన ఉన్న కోదండరాంనగర్, సీసల బస్తీ, పీ అండ్ టీ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కాలనీల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటికి రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్ నగర్ చెరువు ఈ కాలనీలను ముంచెత్తగా…. మళ్లీ వానలతో ఎప్పుడేం జరుగుతోందనని కాలనీల వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.