సీఎం జగన్ కార్యాలయం వద్ద హై అలర్ట్!

-

అమరావతి:  తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, ఇతర సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చేపట్టిన ఈ నిరసనలు ఆదివారంతో 550 రోజులకు చేరుకోనుంది. ఈ సందర్భంగా నిరసనను రైతులు ఉధృతం చేస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ ఇల్లు, కార్యాలయం ముట్టడికి యత్నించే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారు. సీఎం జగన్ నివాసం, కార్యాలయం పరిసరాల్లో పోలీసులు శుక్రవారం సాయంత్రం నుంచి భారీగా మోహరించారు.

రెండు రోజుల పాటు జగన్ నివాసం పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే అనుమతిస్తున్నారు. పరిసర గ్రామాల్లోనూ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కొత్తవారిని గ్రామాల్లోకి రావొద్దని షరతులు పెట్టారు. ఎవరైనా వచ్చినా, వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చినా కేసులు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం వరకూ జగన్ నివాసం, కార్యాలయం వైపు ఎవరూ రావొద్దని సూచికలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో కూడా పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.

కాగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని రోజులైనా నిరసనలను వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల ఆంక్షలతో ఉద్యమాన్ని అణచలేరని వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతి కొనసాగిస్తామని ప్రకటన చేసే వరకూ వెనక్కి తగ్గమని అంటున్నారు. మరోవైపు రాజధాని మార్పుపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదని రైతులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news