స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు స్టే నిరాకరించిన హై కోర్టు… ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. 60 శాతం రిజర్వేషన్ లు ఎస్సీ, ఎస్టీ, బిసి లకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర‌్ణయాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. దీనితో ఇప్పుడు ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార విపక్షాల మధ్యే స్థానిక పోరు ఉండనున్న నేపథ్యంలో.

ప్రజల్లో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బలంగా ఉంది… పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లే ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం జగన్ వెనకడుగు వేయడం లేదు. ముందు జీతాలు కూడా ఇవ్వలేరు అనే పరిస్థితి నుంచి నేడు కీలకమైన సంక్షేమ పథకాలను అమలు విజయవంతంగా చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే వరకు జగన్ పాలన వెళ్ళింది. గ్రామాల్లో ఇప్పుడు దీనిపై ఏ మేరకు సానుకూలత ఉంది అనేది తెలియాలి అంటే…

త్వరలో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రావాల్సి ఉంటుంది. ఇకపోతే… విపక్షం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేస్తుంది. ప్రధానంగా ఇసుక సమస్యను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు దీక్ష కూడా చేశారు. అదే విధంగా పింఛన్లు ఆపేశారని, ప్రభుత్వ విధానాల్లో ప్రజలపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది విపక్ష వాదన… ఈ వాదనకు పస చేకూరాలి అంటే… ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మూడో పార్టీ గా ఉన్న జనసేన కూడా ఈ ఎన్నికలపై ఎక్కువగానే దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి.