ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కొందరు దుండగులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని జియో సెల్ టవర్లను భారీ ఎత్తున ఇటీవలి కాలంలో ధ్వంసం చేసిన విషయం విదితమే. సుమారుగా 1500కు పైగానే టవర్లను ధ్వంసం చేశారు. అలాగే జియోకు చెందిన ఇతర ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. దీంతో రిలయన్స్ కంపెనీ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
రిలయన్స్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించగా.. ధర్మాసనం ఎదుట పంజాబ్ అడ్వకేట్ జనరల్ అతుల్ నందా, కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సాలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతుల్ నందా కోర్టుకు పలు విషయాలను తెలిపారు. జియో సెల్ టవర్లు, ఆస్తుల ధ్వంసం విషయమై పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో 1019 పెట్రోల్ బృందాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అలాగే టవర్లకు కలిగిన నష్టం వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం 22 మంది నోడల్ అధికారులను కూడా నియమించిందన్నారు.
కాగా పంజాబ్, హర్యానాలలో తమ కంపెనీకి చెందిన 1500కు పైగా టవర్లతోపాటు ఇతర ఆస్తులు ధ్వంసం అయ్యాయని రిలయన్స్ సంస్థ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే తమ ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్న వారితోపాటు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని ఆ కంపెనీ కోర్టును కోరింది.