పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీఓ 57,58 పై ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 17వ వరకు ఎలాంటి ఫలితాలు విడుదల చేయవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఎస్సై, కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు బోర్డు ఎక్కడా జీవో నంబర్ 57, 58 గురించి ప్రస్తావించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాక ఈ జీవోలు తీసుకువచ్చి ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లున్న అభ్యర్థుల కటాఫ్ మార్కులు తగ్గిస్తున్నట్లు బోర్డు ప్రకటించిందని చెప్పారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లను బోర్డు పూర్తిగా పట్టించుకోలేదన్నారు. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అసలు అమలే కాలేదన్నారు. దీంతో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులందరూ తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.