మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి తొడగొట్టి రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. రేవంత్ రాజీనామా చేసి తనతో పోటీ చేయాలని మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. తాను అక్రమంగా సంపాదించలేదని కష్టపడి సంపాదించానని మల్లారెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి దొంగ అంటూ పిసిసి పదవిని రేవంత్ రెడ్డి కొనుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి బట్టే బాజ్ అంటూ అసభ్య పదజాలం తో దూషించారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రేవంత్ రెడ్డి అనుచరులు.. కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో నిన్న రాత్రి నుంచి మల్లారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికీ పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మంత్రి ఇంటి ముట్టడి కి ప్రయత్నిస్తున్నారు.