పెద్దపల్లి: జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంథని మండలంలో గోదావరి తీరం వెంబడి పొలాల్లోకి వరద నీరు చేరింది. మంథని గౌతమేశ్వరస్వామి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఆలయంలో 28 మంది భక్తులు భక్తులు చిక్కుకున్నారు. పూజారి సహా 10 కుటుంబసభ్యులు ఆలయంలోనే ఉండిపోయారు. గోదావరిలో చేపట వేటకు వెళ్లిన 11 మంది మత్య్సకారులు కూడా గౌతమేశ్వరస్వామి ఆలయంలో చిక్కుకున్నారు. నిద్ర చేసేందుకు వెళ్లిన భక్తులు కూడా ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయం చుట్టూ నీరు చేరడంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏం జరుగుతుందోనంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వర్షాల దృష్ట్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ ఏర్పాటు రూమ్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939 ఏర్పాటు చేశారు. ఉట్నూరు, నేరడిగొండ, బోథ్‌లో రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలు అందిస్తున్నారు. నిర్మల్‌లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిర్మల్‌లో విద్యుత్ సమస్యల పరిస్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 790628368 నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. అటు జలాశయాలు కూడా నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.