కరోనా తగ్గిన వారి రక్తం తో కరోనా బాధితులకు చికిత్స అందించి నియంత్రించవచ్చు అంటూ ఈ కొత్త తరహా వైద్యం తెరపైకి వచ్చింది. ఎప్పుడో వందేళ్ల నాటి చికిత్స ను ఇప్పుడు ఉపయోగించి కరోనా ను నియంత్రించవచ్చని కొందరు వైద్యులు భావిస్తున్నారు. వందేళ్ల నాడు వ్యాక్సిన్లు వంటివి ఏవీ అందుబాటులో లేని సమయంలో అంటువ్యాధులు అరికట్టేందుకు ఈ చికిత్సను వాడేవారు. రోగాల నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా ను బాధితులకు ఎక్కించి వ్యాధిని నయం చేసేవారు. అయితే ఇప్పడు కూడా కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మా ను సేకరించి కరోనా తో బాధపడుతున్న వారికి ఎక్కించి నయం చేయాలనీ చూస్తున్నారు. కరోనా భీభత్సం సృష్టింస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ వైద్యం తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే కరోనా పనిపట్టేందుకు ఈ చికిత్స ఉపకరిస్తుందో లేదో తెలుసుకునేందుకు అమెరికా ఆసుపత్రులు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎఫ్‌డీఏ అనుమతికి ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా,అనుమతి లభించగానే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ చికిత్సతో రెండు లాభాలున్నాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రోగంతో బాధపడుతున్న వారిని కోలుకునేలా చేయడంతో పాటూ కొత్త వారికి కరోనా సోకకుండా ఉండేందుకు ఈ చికిత్స ఓ తాత్కాలిక వ్యాక్సిన్‌లా ఉపయోగపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చికిత్స ఆశించిన ఫలితాన్ని ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం ప్రస్తుతానికి ఇవ్వలేమని అంటున్నాయి. ఒక సారి ఈ విధానాన్ని పరీక్షించే వరకూ ఏమవుతుందో చెప్పలేము. అయితే చారిత్రక ఆధారాలను చూస్తే మాత్రం దీనితో కరోనా కట్టడి సాధ్యమయ్యే అవకాశం ఉంది అని ఒక డాక్టర్ అభిప్రాయపడ్డారు.