సాధారణంగా రాజకీయ వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ ధిట్ట..అలాగే ప్రత్యర్ధులు వేసే వ్యూహాలకు ఏ మాత్రం భయపడకుండా ఎదురునిలబడి రాజకీయాలు చేయడం కూడా కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యే. అయితే రాజకీయంగా ఎప్పుడు కేసీఆర్ భయపడిన సందర్భాలు లేవు. కానీ ఫస్ట్ టైమ్ హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో కేసీఆర్ కాస్త కంగారు పడుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
ఎందుకంటే దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన టీఆర్ఎస్‌కు తిరుగుండేది కాదు. కానీ దుబ్బాక ఉపఎన్నిక నుంచి కాస్త పరిస్తితులు తారుమారయ్యాయి. దుబ్బాకలో టీఆర్ఎస్‌ని బీజేపీ మట్టికరిపించింది. దీంతో కేసీఆర్ కాస్త అలెర్ట్ అయ్యారు. మొన్నటివరకు ప్రతిపక్షాలు తనని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేవని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లు రేసులోకి వచ్చాయి.
ఇక మొన్నటివరకు కేసీఆర్ కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్‌ని పార్టీ నుంచి ఎలా బయటకు పంపారో అందరికీ తెలిసిందే. తనని మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఈటల టీఆర్ఎస్‌ని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిపోయారు. దీంతో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే క్రమంలో ఎక్కడ ఓడిపోతే, టీఆర్ఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ జరుగుతుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే, కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారనే వాదన జనాల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే ఈటలని ఓడించడానికి గట్టిగానే వ్యూహాలు పన్నుతున్నారు.
వరుసపెట్టి బడా బడా నేతలనీ పార్టీలో చేర్చుకుంటున్నారు. వేల కోట్లు పెట్టి హుజూరాబాద్‌లో పథకాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. అంటే ఈటల విషయంలో కేసీఆర్ ఎంత భయంతో ఉంటే ఇలా చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.