హైదరాబాద్: ఈటల రాజేందర్‌పై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తమ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈటల విషయంపై తమ శ్రేణుల్లో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. కేసులకు భయపడి బీజేపీలో చేరుతున్నారని, మంచి నిర్ణయమే తీసుకున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం మామూలేకదా అని అన్నారు. కరోనా విషయంలో ఇప్పటి వరకు కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. కోవిడ్‌ను ఎదుర్కొనే ఉద్యేశ్యం కేసీఆర్‌కు లేదన్నారు. నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారికి ఏం చెప్పలేమని షర్మిల ఎద్దేవా చేశారు.
ఇక షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై వేగంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా పేరును ఖరారు చేశారు. ఇందుకు ఎన్నికల కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే షర్మిల పార్టీకి టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు.