తెలంగాణ రాజకీయవర్గాల చూపంతా ఇప్పుడు హజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంపై ఉంది. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే.. అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులను ప్రకటించలేదుగానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థి ఖరారు అంశం అగ్రనేతల మధ్యనే వార్ క్రియేట్ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పద్మావతి పేరును ప్రకటిస్తే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం చామల కిరణ్‌రెడ్డి పేరును సూచిస్తున్నారు. దీంతో పార్టీలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు.
ఇక ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఉత్తమ్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇక అప్పటి నుంచి ఈ టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానికంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో పద్మావతి పోటీ చేస్తుందంటూ సంకేతాలు ఇచ్చారు. పద్మావతి పేరు ఖరారు అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇక్కడే మొదలైంది రచ్చ.
ఇలా ప్రకటించడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. హైకమాండ్ ఉండగా.. ఉత్తమ్ ఎలా ప్రకటిస్తారంటూ ఏకంగా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియాకు ఫిర్యాదు చేయడంతో మరింత వేడిపుట్టింది. ఇక్కడే రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తానేమే పోటీ చేయబోనని, తమ పార్టీ తరపున అభ్యర్థిగా స్థానిక నేత అయిన చామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని ప్రకటించారు. పద్మావతి పేరు ప్రకటనపై ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను వివరణ కోరాలని రేవంత్ సూచించారట.
ఇలా అగ్రనేతలు ఎవరికివారుగా ఇద్దరి పేర్లను ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో తీవ్రా ఆందోళన నెలకొంది. మరోవైపు రేవంత్ పీసీసీ పీఠంపై కన్నేసి ఇలా చేస్తున్నాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్రనేతలే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో హుజూర్‌నగర్ టికెట్ ఎవరికి వస్తుందన్న విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. పద్మావతికి ఇస్తారా..? లేక చామల కిరణ్‌రెడ్డికి ఇస్తారా..? అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఇందులో ఎవరికి టికెట్ దక్కినా మరొకరు పంతం నెగ్గిచ్చుకోనట్టేనని, ఇది పార్టీలో విపరీత పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఆ స్థానం ఉత్తమ్‌కుమార్‌దే కాబట్టి.. ఆయన భార్య పద్మావతికే అవకాశం ఇస్తారని, ఇందులో ఎలాంటి సందేహమూ అవసరంలేదని పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!