త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు : ఓకే.. చెప్పిన కేబినెట్ సబ్‌కమిటీ

-

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్,  స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాల పైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తున్నదని, దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా,  గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఏలాంటి పెంపు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి  లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇదే చట్టం ఆధారంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఏడుసార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 7.5 శాతానికి పెంచిన విషయము ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ  సమావేశంలో చర్చకు వచ్చింది. పక్కనే ఉన్న తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతం గా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్ మరియు హెచ్ఎండిఎ పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీలో విస్తృతంగా చర్చకు వచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు,  నగర విస్తరణ వలన రియల్ భూమ్ వచ్చిందన్నారు.

2019- 20 సంవత్సరానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి అధికంగా రిజిస్ట్రేషన్లు అయిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. మరోవైపు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు లోన్లు రావడంలో కొన్ని పరిమితులు ఉంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇలా వివిధ కారణాల ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది.  ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news