ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం చైనాను భారత్ అధిగమించింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. అత్యంత జనాభా కలిగిన నగరాలను కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జనాభా 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరనుందని తెలిపింది.
జనాభా పరంగా మన నగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది. పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో మూడోవంతు రాజధానిలోనే ఉంటోంది. 1950 ప్రాంతంలో హైదరాబాద్ జనాభా 10 లక్షలకు పైగా ఉండగా.. 1975 నాటికి 20 లక్షలు దాటింది. అంటే పాతికేళ్లలో రెండింతలైంది. ఆ తర్వాత 15 ఏళ్లలో అంటే 1990కి 40 లక్షలకుపైగా పెరిగింది. ఆ తర్వాత 20 ఏళ్లలో (2010 నాటికి) 80 లక్షలకు చేరింది. ఏటా 5 లక్షల మంది ఉపాధిరీత్యా నగరానికి వలస వస్తున్నారు. ఇక్కడే స్థిరపడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య వార్షికంగా 4.07 లక్షలు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు 88,216గా అంచనా వేశారు.