వ‌ర్ష బీభ‌త్పం-హైద‌రాబాద్‌లో కుంభ‌వృష్టి

-


హైదరాబాద్ తడిసి ముద్దయింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ జోరు వాన కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన ఈ వర్షానికి నగరం వణికిపోయింది. సుమారు ఏడు గంటల వాన నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.  విరామం లేకుండా కురిసిన వానకు  రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.  వరద నీటిలో పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వృక్షాలు నేలకొరిగాయి.

నగరంలో గత ఐదారు సంవత్సరాల్లో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారని తెలుస్తోంది.  మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓ మోస్తరు వర్షం కురిసింది. మ‌ళ్లీ రాత్రి ఎనిమిది గంట‌ల‌కు వ‌ర్షం మొద‌లైంది కుంపోత‌గా ప‌ద‌కొండు గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగింది. వర్షానికే నగర జీవనం స్తంభించిపోగా.. కాస్త తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయి.. ఇంటికి వెళ్లే దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రోడ్లపై భారీ స్తాయిలో నీరు నిలిచి ఇళ్లలోకి వస్తుండటంతో పలుచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు తెరిచేశారు. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో ముందస్తు చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

నగర వ్యాప్తంగా అన్ని చోట్లా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, సనత్‌ నగర్‌, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నేరేడ్‌మెట్‌, ఏఎస్‌ రావు నగర్‌, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి సహా చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా వర్షపునీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
శ్రీనగర్‌ కాలనీలో ఏకంగా ఓ చెట్టు విరిగిపడిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు గచ్చిబౌలి-హైటెక్ సిటీలో కూడా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బోయిన్ పల్లి హైవేపై కూడా భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు యూసఫ్ గూడలో కుండపోత వర్సంతో నిలిపిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది.

హైటెక్‌ సిటీ ప్రాంతంలోని ఐకియా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. గచ్చిబౌలిలోని ఇనార్బిటాల్ మాల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, అమీర్‌పేట, ఖైరతాబాద్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తిరుమలగిరిలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలానగర్ 5.5 సెం.మీ., మల్కాజ్‌గిరి 5.1 సెం.మీ., షేక్‌పేట 4.8 సెం.మీ., అసిఫ్‌నగర్ 4.5 సెం.మీ., వెస్ట్‌మారెడ్‌పల్లి 3.9 సెం.మీ., అల్వాల్ 3.5 సెం.మీ., శేరిలింగంపల్లి 3.1సెం.మీ., ఖైరతాబాద్‌లో 3 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు.

ముందుజాగ్రత్తగా సహాయ చర్యల కోసం అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని రంగంలోకి దించారు. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. మ్యాన్‌హోళ్లను తెరిచి వర్షపు నీటిని కిందికి పంపించారు.

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.. జీహెచ్ఎంపీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పరిస్థితిని సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news