ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటి నేడు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్న నేపధ్యంలో ఈ సమావేశంలో ఏ నిర్ణయం వెల్లడిస్తారో అనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణ సహా రాష్ట్ర సమగ్రాభివృద్దిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో రాజధాని అంశంపై,
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రధానంగా అమరావతి ప్రాంత రైతుల సమస్యలను జగన్ దృష్టికి కమిటీ సభ్యులు తీసుకువెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. గత నెల రోజుల నుంచి చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కూడా సూచించే అవకాశం ఉందని అంటున్నారు.
రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ నివేదికలను ఇప్పటికే పరిశీలించిన కమిటీ, ఇప్పటికే మూడు సార్లు సమావేశమై పలు పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. అదే విధంగా విశాఖలో సెక్రటేరియట్ ఏర్పాటు చేసేలా ఉంటే అక్కడికి తరలివెళ్లే ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. రాజధాని తరలింపు ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దాని మీద కూడా చర్చలు జరపనున్నారు.