తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక తేదీ ఖరారైనప్పటినుంచి తెలుగుదేశం పార్టీ తన వ్యూహకర్త రాబిన్ శర్మపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి పనిచేయమని ప్రశాంత్ కిషోర్‌ను అడిగినప్పటికీ ఆయన నిరాకరించడంతోఆ పార్టీ రాబిన్‌శర్మతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఉంది. ఒకపుడు ప్రశాంత్ బృందంలో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. పీకే నిరాకరించడంతో తిరుపతి గెలుపు బాధ్యతను టీడీపీ రాబిన్‌కు అప్పగించింది.
రాబిన్‌శర్మ సలహాలేంటి?
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాబిన్ ఇంతవరకు ఏమి సలహాలిచ్చారో బయటకు వెల్లడవలేదుకానీ తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం బయటకు వస్తాయి. రాబిన్‌శర్మ వ్యూహాలేంటనేది అందరికీ తెలుస్తాయి. నిజానికి ఈ ఎన్నికలో గెలుపన్నది వైసీపీ నల్లేరుమీద బండి నడకలాంటిదే. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని? ఈసారి ఎన్ని వస్తాయి? ఎవరి మెజార్టీ ఎంత? అనే విషయాలు గమనించాలి. అలాగే వైసీపీ వ్యూహాలేంటి? రాబిన్‌శర్మ వ్యూహాలేంటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ ఎంత? ఇప్పుడు ఎంత వస్తుంది? పీకేను రాబిన్ ఢీకొట్టగలడా? ఆయనకు ప్రత్యామ్నాయంగా నిలబడగలడా? తదితర విషయాలన్నీ బయటకు వస్తాయి.
గతంలో వచ్చిన ఓట్లే వస్తాయా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన తరుణంలోనే తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. ఎలాగూ గెలుస్తామనే నమ్మకం ఉందికాబట్టి భారీ మెజార్టీ సాధించి దేశం మొత్తం తిరుపతివైపు చూసేలా చేయాలని జగన్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిలబడగలిగితే రాబిన్ పనితనం కూడా ఉందనుకోవాలి. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.9 లక్షల ఓట్లు తిరిగి పడితే ఒకరకంగా ఆ పార్టీ గెలిచినట్లే అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఒక్కడే పోరాడకుండా ఇంటిదగ్గరుండే ఇతర నేతలు కూడా కార్యకర్తలతో కలిసి పోరాడితే ప్రజాభిమానాన్ని గెలుచుకోగలరు. ప్రశాంత్ కిషోర్‌కానీ, రాబిన్ శర్మలాంటివారుకానీ సమాజంలో మతాలమధ్య, కులాలమధ్య చిచ్చుపెట్టి ఓటర్లను చీల్చి ఏదో ఒక పార్టీని గెలిపించి తమకున్న కాంట్రాక్టు ప్రకారం కోట్లరూపాయలు కొల్లగొట్టుకుపోవడమేకానీ వీరివల్ల సమాజానికి ఏం ఉపయోగముంటుంది?. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిచినా, 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు గెలిచినా ప్రజలు కావాలని ఓట్లువేయడంవల్లే ఆ రెండు పార్టీలు విజయం సాధించగలిగాయి. ప్రజాభిమానం ఉన్నప్పుడు ఎవరి వ్యూహాలు పనిచేయవు.