తాను అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉంటే దేశాన్ని షట్ డౌన్ చేసేవాడినని డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ అన్నారు. అమెరికాలో కరోనాను కంట్రోల్ చేసేందుకు ఏమైనా చేసేవాడినని, అవసరం అయితే సైంటిస్టుల సూచన మేరకు దేశం మొత్తాన్ని షట్ డౌన్ చేసే వాడినని అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఏబీసీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాను అమెరికా అధ్యక్షుడు అయి ఉంటే అమెరికా పౌరులను కరోనా నుంచి కాపాడేందుకు ఏ కఠినమైన నిర్ణయాన్ని అయినా సరే వెనుకాడకుండా తీసుకునేవాడనని బిడెన్ అన్నారు. కరోనాను కంట్రోల్ చేయలేకపోతే దేశం ముందుకు పురోగమించదని అన్నారు. సైంటిస్టులు సూచిస్తే దేశాన్ని షట్ డౌన్ చేయడంలో తప్పు లేదన్నారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కూళ్లను రీఓపెన్ చేసేందుకు యత్నిస్తున్న విషయం విదితమే. అయితే ఇప్పటికే అక్కడ అనేక స్కూళ్లు ఓపెన్ కాగా.. స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులకు కూడా చాలా మందికి కరోనా సోకుతోంది. దీంతో తల్లిదండ్రులు ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికాలో ఇప్పటికే 5.5 మిలియన్ల మందికి పైగా కరోనా సోకగా.. 1.75 లక్షల మంది చనిపోయారు.