తెలంగాణలో లూప్ లైన్ ఐఏఎస్ ల పై ఆసక్తికర చర్చ

-

అనుభవం ఆధారంగా సీనియర్ ఐఏఎస్ లు కీలక పోస్టుల్లో కొనసాగుతారు. కొందరైతే రిటైర్మెంట్‌ టైమ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కానీ.. తెలంగాణలో తమ పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారట పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు. సీనియారిటీ ఉన్నా.. ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగాల్సి వస్తోందని..అక్కడే రిటైర్‌ కావాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారట. తెలంగాణలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ల పరిస్థితి పై అధికార వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

వడ్డించేవాడు మనవాడే అయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. తేడా వచ్చిందో కడుపు మాడ్చుకోవాల్సిందే. తెలంగాణలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ల పరిస్థితి కూడా అలాగే ఉందట. ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే రిటైరైపోతున్నారు. కళ్లముందే జూనియర్లు కీలక పోస్టుల్లో ఉంటే.. తమకీ దుస్థితి ఏంటని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట. రిటైర్మెంట్‌ చివరి రోజుల్లో పనిష్మెంట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు లూప్‌లైన్‌లో పోస్టుల్లోనే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉన్నవారి పరిస్థితి అంతేనని అనుకుంటున్నారట.

ఇటీవల రిటైర్‌ అయిన ఐఏఎస్ లలో బీపీ ఆచార్య, జగదీశ్వర్‌, రాజేశ్వర్‌ తివారీ, బీఆర్‌ మీనా ఉన్నారు. ఒకప్పుడు వీరంతా ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన వారే. పదవీ విరమణ దగ్గరకు వచ్చే సరికి ఫ్రేమ్‌ నుంచి ఫేడ్‌ అవుట్‌ అయ్యారు. అలాగే ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా సర్వీస్‌ ముగించుకునే ఐఏఎస్‌లు ఎవరనే దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పెషల్‌ సీఎస్‌ హోదాలో ఉన్న శాలినీమిశ్రా సాధారణ పరిపాలన విభాగంలో పనిలేని స్థానంలో ఉన్నారు. ఆమెకు మంచి పోస్ట్‌ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌ వరకు సర్వీస్‌ ఉంది.

సీఎస్‌ కావాలని ఆశపడ్డ మరో సీనియర్ ఐఏఎస్‌ అదర్‌ సిన్హా వచ్చే ఏడాది మార్చిలో రిటైర్‌ అవుతారు. ప్రస్తుతం స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌లో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సీనియర్లపై కథలు కథలుగా చెప్పుకొంటున్నారట అధికారులు. ఏప్రిల్‌లో రిటైర్‌ కాబోతున్న సీనియర్‌ ఐఏఎస్‌ చిత్రా రామచంద్రన్‌కు ఒక్కో బాధ్యతను తగ్గిస్తూ ప్రస్తుతం విద్యాశాఖకు పరిమితం చేశారు. గతంలో సీఎంవోలో, ఆరోగ్య శాఖలో పనిచేసిన మరో ఐఏఎస్‌ శాంతి కుమారి అటవీశాఖకు వెళ్లక తప్పలేదు.

ఇదే విధంగా మరికొందరు ఐఏఎస్‌లు.. సెక్రటేరియట్‌లో సీనియర్‌ ఉద్యోగులు చేసే పోస్టుల్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంకా సర్వీస్‌ ఉండటంతో.. భవిష్యత్‌లో తమకు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలా లూప్‌ లైన్‌లో ఉన్న ఐఏఎస్‌లలో ఒకరిద్దరు మినహా మిగతా వారి ట్రాక్‌ రికార్డు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయకపోవడం, కొందరు పనితీరు సీఎంకు నచ్చక, తనకంటే జూనియర్‌ అయిన సీఎస్‌తో పడక.. నాన్‌ ఫోకల్‌ పోస్టింగ్స్‌లో పనిచేస్తున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో ఉందట.

 

 

Read more RELATED
Recommended to you

Latest news