ఏపీలో ఆ మంత్రులు అధికారుల గుప్పిట్లో ఉన్నారా…!

-

కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. అన్ని రోటీన్‌ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. జనం రోడ్డెక్కుతున్నారు.. వాళ్ల వాళ్ల పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఏకంగా స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. అయితే ఇటు మంత్రులు.. అటు ఐఏఎస్సులు మాత్రం సచివాలయం గడప తొక్కడం లేదు. ఇటు మంత్రులు రాక.. అటు సెక్రటరీలు రాకపోవడంతో ఏపీ సచివాలయం ఉసురోమంటోంది. కరోనా వైరస్‌ ఎటాక్‌ దగ్గర్నుంచి సచివాలయం బోసిపోవడానికి కారణం ఐఏఎస్‌ అధికారులేనని చర్చ జరుగుతోంది. మెజార్టీ ఐఏఎస్సులు సచివాలయం గడప తొక్కడానికే ఇష్టపడడం లేదనే చర్చ జరుగుతోంది. ఇక మంత్రులు సచివాలయానికి రాకపోవడానికి ఐఏఎస్సులేననే భావన వ్యక్తమవుతోంది.

గత ఏడెనిమిది నెలల కాలంలో సెక్రటేరీయేట్‌ బోసిపోతూనే కన్పిస్తోంది. గతంలో కరోనా వ్యాప్తి సెక్రటేరీయేట్‌లో ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. దీంతో వివిధ హెచ్‌వోడి కార్యాలయాల్లో మంత్రులు, అధికారులు సమీక్షలు నిర్వహించేవారు. ఇదంతా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడో.. లాక్‌ డౌన్‌లు అమల్లో ఉన్నప్పుడో చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఏకంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలు రోడ్డెక్కి వస్తోంటే.. కొందరు ఐఏఎస్సులు మాత్రం సెక్రటేరీయేట్‌కు రావడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే మంత్రులు వస్తే.. అధికారులు రాక తప్పదు కదా..? మరి మంత్రులూ ఎందుకు రావడం లేదంటే.. అధికారులే రానివ్వడం లేదనే చర్చ అటు మంత్రుల పేషీల్లో జరుగుతోంది.

మంత్రులెవరైనా సెక్రటేరీయేట్లో మీటింగ్‌ పెట్టుకుందామని అంటే చాలు.. లేదు లేదు.. అక్కడ వద్దు హెచ్‌వోడీ కార్యాలయాల్లో రివ్యూ పెట్టుకుందాం అని సంబంధిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులే చెప్పేస్తున్నారట. దీనికి కొందరు మంత్రులు కూడా వెనుకా ముందు ఆలోచన చేయకుండా అయితే ఓకే అంటూ తలూపేస్తున్నారట. దీంతో మంత్రులు కూడా సచివాలయానికి రావడం తగ్గిపోయిందని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయా శాఖలకు చెందిన అధికారుల గుప్పెట్లో కొందరు మంత్రులు కీలు బొమ్మలుగా మారిపోయారని సదురు మంత్రుల పేషీలకు చెందిన సిబ్బందే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.

మంత్రులు స్వయంగా చెప్పినా కొందరు అధికారులు ఏ మాత్రం లక్ష్య పెట్టడం లేదని.. కానీ వారు చెప్పినట్టు మంత్రులు చేసి తీరాల్సిందేననే రీతిలో కొందరు అధికారుల తీరు ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా.. పరిపాలన పడకేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news