బీరు కావాలా.. అయితే రూ.300.. స్ట్రాంగ్ బీరుకు రూ.350.. బ్రాండెడ్ మద్యం ఫుల్ బాటిల్ కావాలా.. రూ.2500.. ఏంటీ.. ఇదంతా.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఏమీ లేదండీ.. కరోనా లాక్‌డౌన్‌తో ఇప్పుడు మద్యం ప్రియులకు ఎక్కడా మద్యం లభించడం లేదు కదా.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఇండ్లలోనే బెల్టు షాపులను ఏర్పాటు చేసి.. ఇలా దాదాపు 3 రెట్ల ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. అవే ఆ రేట్లు.. మద్యం లభించకపోవడంతో చాలా మంది ఎంత మొత్తమైనా చెల్లించి మద్యాన్ని కొనేందుకు ముందుకు వస్తున్నారు. అందుకనే కొందరు ఏకంగా 3 రెట్ల ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల పోలీసులకు పట్టుబడుతున్న బెల్టు షాపుల విక్రయదారులే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు.
దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ, ఏపీల్లోనూ మద్యం విక్రయాలు బంద్ అయ్యాయి. వైన్ షాపులు, బార్లను మూసి వేశారు. దీంతో మందు బాబులు మద్యం దొరక్క నాలుక పీక్కుపోతూ.. ఆందోళనలో ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఇండ్లలోనే కొందరు బెల్టు షాపులను ఏర్పాటు చేసి.. ఏకంగా 3 రెట్ల అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రూ.1వేయి ఉండే మద్యం బాటిల్ ధర ప్రస్తుతం ఏకంగా రూ.3వేలు పలుకుతోంది. అలాగే రూ.700 ఉన్న బాటిల్‌ను రూ.1500కు, రూ.140కు లభించే క్వార్టర్‌ను రూ.300కు విక్రయిస్తున్నారు.
ఇక రూ.120 ఉండే లైట్ బీర్ ఇప్పుడు రూ.300కు, స్ట్రాంగ్ బీర్ రూ.350కి లభిస్తోంది. అయితే బెల్ట్ షాపుల్లో విక్రయదారులు ఎక్కువగా స్టాక్ పెట్టుకోవడం లేదని తెలిసింది. ఇలా చేస్తే ఇబ్బందులు వస్తాయని.. మద్యం స్టాక్‌ను తమకు తెలిసిన వారి ఇండ్లలో పెడుతున్నారని.. కొన్ని చోట్ల బావుల్లో మద్యాన్ని నిల్వ చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో మద్యం అయిపోయింది అయిపోయినట్లు స్టాక్ తీసుకువచ్చి బెల్ట్ షాపుల వ్యాపారులు మద్యాన్ని అమ్ముతున్నారని సమాచారం. అయితే మద్యానికి బానిసలైన వారు మాత్రం ఎంత ధరకైనా సరే.. మద్యాన్ని కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు అనేక చోట్ల దాడులు చేస్తూ.. ఇప్పటికే అనేక మంది బెల్ట్ షాపుల వ్యాపారులను పట్టుకుంటూ.. మద్యాన్ని సీజ్ చేస్తున్నా.. ఇంకా అనేక చోట్ల బెల్ట్ షాపులు యథావిధిగానే కొనసాగుతున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!