తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. పిఆర్సి అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వాలని బుధవారం ఇంజనీర్స్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు.
విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందున వేతనాలను 6% మాత్రమే పెంచగలమని సీఎండీలు స్పష్టం చేశారు. వేతన సవరణ పై నియమించిన కమిటీ 5% పెంపును మాత్రమే సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా తాము ఇంతకుముందు కోరినట్లుగా 30% పెంచాల్సిందేనని అన్ని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే ఆరు శాతానికి మించి పెంచలేమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెకు దిగాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.