మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా.. కానీ ఇప్పుడు కాదు. ఎట్టకేలకు అనుకున్నదే జరిగింది. ప్రపంచం అంతా ఊహించినట్టే అయింది. జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించింది. 142 కోట్ల 86 లక్షల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
ఈ ఏడాది మధ్యలో అధిక జనాభాతో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు స్పష్టం చేశాయి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (U.N.F.P.A) ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మధ్యంతరానికి చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలకు చేరనుండగా.. భారత్ జనాభా 142 కోట్ల 86 లక్షలకు చేరనుంది ఐరాస అంచనా వేసింది. 34 కోట్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో నిలవనుందని ఐరాస నివేదిక తేటతెల్లం చేసింది.