ప్రపంచ మానవాళిని తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని.. ప్రపంచమంతా కోడై కూస్తోంది. కరోనా వైరస్ చైనా సృష్టేనని జనాలు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చైనాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు ఇకపై అక్కడ పనిచేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. అందుకనే.. ఇప్పటికే పలు సంస్థలు చైనాలో ఉన్న తమ పరిశ్రమలు, కార్యాలయాలను తమ సొంత దేశాలకు తరలించేశాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చైనాలో ఉన్న అమెరికా సంస్థలను వెనక్కి వచ్చేయాలని అంటున్నారు. ఈ క్రమంలో చైనాకు అన్ని దారులు మూసుకుపోతున్న వేళ… ఆ దేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా భారత్ ఎదుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఎలక్ట్రానిక్స్ మొదలుకొని అనేక వస్తువులకు సంబంధించిన తయారీ పరిశ్రమలు చైనాలోనే అధికంగా ఉన్నాయి. విదేశాలకు చెందిన పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు కూడా చైనాలోనే అధికంగా ఉన్నాయి. అందుకు కారణం.. అక్కడ మ్యాన్ పవర్ చాలా తక్కువకు దొరుకుతుంది. దీంతోపాటు అక్కడ పరిశ్రమలను నెలకొల్పడం చాలా తేలికైన పని. అందుకనే అనేక ప్రముఖ సంస్థలు అక్కడ తయారీ పరిశ్రమలను నెలకొల్పాయి. వాటిల్లో ఆయా వస్తువులను ఉత్పత్తి చేస్తూ.. వాటిని ఇతర దేశాలకు చైనా నుంచే సరఫరా చేస్తున్నాయి. అయితే కరోనాపై మొదట్నుంచీ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న చైనాను ఇక నమ్మే పరిస్థితి లేనందున.. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తరలివెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు భారత్లో తమ పరిశ్రమలను నెలకొల్పేలా, తమ కార్యకలాపాలను ఇక్కడే కొనసాగించేలా భారత్ వాటిని ఆకర్షించాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆయా సంస్థలను ఇక్కడకు రప్పించడం ద్వారా భారత్ చైనాకు ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.
ఇక మరోవైపు ప్రధాని మోదీ కూడా పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భారత్లో విదేశీ, స్వదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై, చైనా నుంచి వెళ్లిపోయే పరిశ్రమలను భారత్కు రప్పించే మార్గాలపై వారి చర్చ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్రం త్వరలో పెట్టుబడి దారుల సమస్యలను గుర్తించి వారికి తగినతం సహాయం చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుందని తెలిసింది.
దేశంలో అనేక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను ప్రోత్సహించడం, పరిశ్రమలు పెట్టేందుకు స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన, వేగంగా పెట్టుబడులను రాబట్టడం.. వంటి అనేక అంశాలపై సమూలంగా చర్చించి.. ఆయా అంశాలను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన వ్యూహాలు, ప్రణాళికలను రచించడం.. రాష్ట్రాలను ఇందుకు సిద్ధం చేయడం.. వంటి అనేక అంశాలను మోదీ చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో చైనా నుంచి తరలిపోయే పరిశ్రమలను భారత్కు రప్పించడమే లక్ష్యంగా కేంద్రం తదుపరి కార్యాచరణ ఉంటుందని సమాచారం. మరి మోదీ ఈ విషయంలో ఏ విధంగా ముందుకు దూసుకెళ్తారో చూడాలి..!