ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉందా ? అయితే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తన ఖాతాదారులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ను చాలా తక్కువ ప్రీమియంకే అందిస్తోంది. అందుకు గాను ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని ప్రారంభించింది. పీఎన్‌బీ మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఐపీపీబీ భాగస్వామ్యం అయి ఈ ఇన్సూరెన్స్‌ను తన కస్టమర్లకు అందిస్తోంది.
ఈ స్కీం కింద ఐపీపీబీ కస్టమర్లు రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ను చాలా తక్కువ ప్రీమియంకే పొందవచ్చు. రోజుకు కేవలం రూ.1కే ఈ స్కీంలో చేరవచ్చు. ఇందుకు గాను ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సంవత్సరంలో ఏ నెలలో ఈ స్కీంలో జాయిన్ అయ్యారు అన్న విషయాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. అంటే రూ.330 ని 12 నెలలకు విభజించి కోల్పోయిన నెలలను తీసేసి మిగిలిన నెలలకు ప్రీమియం కడితే చాలు. అలా ఈ స్కీంలో చేరవచ్చు. తిరిగి ఏడాది ఆరంభంలో మళ్లీ రూ.330 చెల్లించి ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు.
ఈ విధంగా లభించే ఇన్సూరెన్స్‌లో మొత్తం రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి చనిపోతే అతని నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఈ స్కీంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు చేరేందుకు అర్హులు. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉండాలి. స్కీంలో చేరేందుకు కస్టమర్లు ఆధార్ వివరాలను కేవైసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.