సంస్కృతం భాషను దైవ భాష అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భారతీయ భాషలు వచ్చాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుత తరుణంలో సంస్కృత భాషను నేర్చుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా అనేక గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి కనుక విదేశీయులు సైతం మన సంప్రదాయలు, ఆచార వ్యవహారాలు, పురాణాల గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు సంస్కృతాన్ని నేర్చుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వారికి సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది.
అయితే సంస్కృతం భాషను మరింత సులభంగా నేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లిటిల్ గురు పేరిట ఓ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా సరే సంస్కృత భాషను సులభంగా నేర్చుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఈ యాప్‌ను డెవలప్ చేసింది. ఈ యాప్‌ను బెంగళూరుకు చెందిన స్పోర్ట్స్ విజ్ అనే స్టార్టప్ సంస్థ సహకారంతో రూపొందించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
లిటిల్ గురు యాప్ సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, విదేశీయులతోపాలు సన్యాసులు, పండితులకు కూడా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సంస్కృతం భాషను చాలా మంది నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారని, కనుకనే ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని ఐసీసీఆర్ డీజీ దినేష్ కె పట్నాయక్ వెల్లడించారు. ఇక సంస్కృతం నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మొదటి యాప్ ఇదే కావడం విశేషం.