చంద్రబాబు వ్యాఖ్యలతో జనసేన ఓట్లు టీడీపీకి టర్న్ అవుతాయా ?

-

తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో వకీల్‌సాబ్‌కు గట్టి మద్దతిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చంద్రబాబు స్పందన రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వకీల్‌సాబ్‌ విషయంలో చంద్రబాబు దూకుడు చూసి చంద్రబాబు ప్లాన్ వేరే ఉందా అన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో సైతం నడుస్తుందట. బీజేపీ నేతల పై కస్సుబుస్సులాడుతున్న జనసేన కేడర్ ఉపఎన్నికలో మరో ఆలోచన చేస్తుందా..లేక భవిష్యత్‌ రాజకీయాలకు దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు వకీల్ సాబ్ అంశాన్ని భుజనకెత్తుకున్నారా అని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.


తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతు ఇచ్చారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. రత్నప్రభకు సపోర్ట్‌గా తిరుపతిలో పాదయాత్ర చేశారు.. బహిరంగ సభ నిర్వహించారు జనసేనాని. ఈ స్థాయిలో రెండు పార్టీలు వేర్వేరుమార్గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రబాబు వకీల్‌సాబ్‌ గురించి మాట్లాడటమే ఆసక్తి కలిగిస్తోంది. ఆయన వైఖరిని చూసిన వాళ్లంతా వకీల్‌సాబ్‌ విషయంలో చంద్రబాబు దూకుడుగా ఆశ్చర్యం కలిగించింది. భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా కర్చీఫ్‌ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ అంశంపై చిత్రానికి సంబంధించిన వాళ్లు ఎవరూ రియాక్ట్‌ కాలేదు. హీరో పవన్‌ కల్యాణ్‌ సైతం పెదవి విప్పింది లేదు. కానీ వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్‌ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. టికెట్ల రేట్ల పెంపు విషయంలో బీజేపీ నేతలు కూడా స్పందించారు. కానీ.. టీడీపీ అధినేత రియాక్షన్‌ ముందు కమలనాథులు తేలిపోయారనే టాక్‌ ఉంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాకుండా.. సాధారణ సందర్భం అయి ఉన్నట్టయితే.. వకీల్‌సాబ్‌పై చంద్రబాబు రియాక్షన్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు.

ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో ప్రత్యర్థి పార్టీ నేత సినిమా గురించి చంద్రబాబు నిగ్గదీసి అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారపార్టీ వైసీపీ వెంటనే యక్షన్‌లోకి దిగిపోయింది. ఎవరు ఏ పార్టీయో.. ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నాయకులు. సినిమా పై రాజకీయ రగడను పక్కన పెడితే.. చంద్రబాబు వకీల్‌సాబ్‌ సినిమాకు బాసటగా నిలవడం వెనక బలమైన వ్యూహం ఉందన్న చర్చ నడుస్తుంది.

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల ఓపెన్‌గానే జనసేన,టీడీపీ కలిసి బరిలో దిగాయి. గతంలోలా జనసేనాని పై విమర్శలు లేవు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇచ్చాక..కొన్నాళ్లపాటు రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కి సైతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వచ్చాయి. మళ్లీ పవన్‌ కల్యాణ్‌తో కలిసి నడవాలని అనుకుంటున్నారో ఏమో ఉప ఎన్నిక వేళ అంది వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news