ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ ఇటీవలే స్మార్ట్ ఫోన్ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇకపై స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయబోమని ఎల్జీ తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసేందుకు భారీ డిస్కౌంట్లతో ఫోన్లను విక్రయిస్తోంది. ఇక ఫోన్లను కొనేవారికి ఏడాది వారంటీతోపాటు 5 ఏళ్ల వరకు సర్వీస్‌ను అందిస్తామని స్పష్టం చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఎల్జీ తప్పుకోవడానికి వెనుక ఉన్న కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే…
ప్రస్తుతం అనేక కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లను అందిస్తున్నాయి. ఇది చాలా విజయవంతమైన ప్రయోగం. షియోమీ, రియల్‌మి వంటి కంపెనీలు ఇలాగే సక్సెస్ అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి. కానీ ఎల్జీ మాత్రం ఇంకా ఈ కోవలోకి రాలేదు. పాత హార్డ్‌వేర్‌తో తక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లను ఎక్కువ ధరలకు అందిస్తుండడంతో జనాలకు నచ్చలేదు. దీంతో ఆ ఫోన్లను కొనేందుకు సహజంగానే వినియోగదారులు విముఖతను ప్రదర్శించారు. ఎల్జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వెనుకబడేందుకు ఇది ఒక కారణం.
ఇక అనేక కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లు, వైవిధ్యభరితమైన స్పెసిఫికేషన్లతో ఫోన్లను అందిస్తుంటే ఆ సృజనాత్మకతను ప్రదర్శించడంలో, దాన్ని అంది పుచ్చుకోవడంలో ఎల్జీ వెనుకబడింది. అలాగే పాత డిజైన్లతో మొబైల్‌ను తయారు చేయడం, అవి పెద్దగా ఆకట్టుకోకపోవడం, పాత మోడల్స్‌లాగే కొత్త మోడల్స్‌ను విడుదల చేయడం, పెద్ద తేడాలు ఏమీ లేకపోవడం, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను అందివ్వకపోవడం, కన్ఫ్యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ మోడల్స్ పేర్లు.. వంటి అనేక కారణాల వల్ల ఎల్జీ ఈ మార్కెట్లో వెనుకబడింది. ఫలితంగా భారీ నష్టాలను చవి చూసింది. అందుకనే స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. నిజానికి ఇతర కంపెనీలకు దీటుగా ఫోన్లను తక్కువ ధరలకే అందిస్తూ వాటిల్లో ఎక్కువ ఫీచర్లను ఇచ్చి ఉంటే ఇప్పుడు ఎల్జీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.