కరోనా వైరస్ కారణంగా విధించబడిన లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగానే దేశంలోని అన్ని జిల్లాలను 3 జోన్లుగా విభజించి.. కరోనా తీవ్రత మేరకు.. లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల కిరాణా షాపులను త్వరలో సురక్షా స్టోర్లుగా మార్చనున్నారు. ఈ క్రమంలో FMCG కంపెనీలు కిరాణా షాపుల వారికి శిక్షణ ఇచ్చి వారి షాపులను సురక్షా స్టోర్లుగా మార్చే బాధ్యత తీసుకోనున్నాయి.
కిరాణా షాపును సురక్షా స్టోర్‌గా మార్చాలంటే.. అందుకు కిరాణా షాపుల వారు తమ దుకాణాల్లో పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. షాపు వద్ద కస్టమర్‌కు, కస్టమర్‌కు కనీసం 1.5 మీటర్ల సోషల్ డిస్టాన్స్‌ను పాటించాలి. అలాగే కౌంటర్ వద్ద డబ్బు ఇచ్చే సమయంలో, సరుకులు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కస్టమర్లకు హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లను అందుబాటులో ఉంచాలి. పూర్తిగా సామాజిక దూరం పాటిస్తూ షాపును నిర్వహించాలి. షాపును, షాపు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. దీంతో కిరాణా షాపు.. సురక్షా స్టోర్ అవుతుంది. ఆ మేర సురక్షా స్టోర్ బోర్డును షాపు యజమాని తన షాపు ఎదుట ఉంచాలి. ఇందుకు గాను FMCG కంపెనీలు కిరాణా షాపుల యజమానులకు కావల్సిన శిక్షణను అందివ్వనున్నాయి.
ఇక భారీ పరిశ్రమలు ఒక్కొక్కటి 10 వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, 1 గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. పరిశ్రమల్లో సామాజిక దూరం పాటించేలా చూడాలి. పూర్తిగా సురక్షితమైన వాతావరణంలో పరిశ్రమల కార్యకలాపాలు జరిగేలా చూడాలి. అలాగే గ్రామాల్లో పరిశుభ్రత, సామాజిక దూరంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సామాజిక దూరం పాటిస్తూ.. సురక్షితంగా ఉండడం నేర్పాలి. అవసరం అయితే హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు వంటి వాటిని అందజేయాలి. దీంతో ఆయా ప్రాంతాల్లో సురక్షా సర్కిల్స్ ఏర్పాటవుతాయి. ఇలా దేశంలోని అన్ని గ్రామాలతోపాటు అన్ని పరిశ్రమల్లోనూ సురక్షా సర్కిల్స్ ఏర్పడి.. దేశం సురక్షితంగా ఉంటుంది. కరోనా కట్టడి సాధ్యమవుతుంది. ఈ క్రమంలో కేంద్రం ఈ విషయాలపై త్వరలోనే వివరాలను వెల్లడించనుంది..!