కలసి వచ్చిన కరోనా లాక్‌డౌన్‌.. రైల్వే శాఖ జోరు..

-

కరోనా లాక్‌డౌన్‌ను దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకున్నాయి. రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అనేక పనులను ప్రభుత్వాలు పూర్తి చేసుకున్నాయి. రోడ్లను నిర్మించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి పనులను లాక్‌డౌన్‌ సమయంలో వేగంగా పూర్తి చేశారు. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని ఇటు రైల్వే శాఖ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 200 ప్రాజెక్టులను రైల్వే శాఖ ఎట్టకేలకు పూర్తి చేసి జోరు మీదుంది.

indian railways completed 200 pending projects in corona lock down time

కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రైల్వే శాఖ రైలు సర్వీసులను నిలిపివేసింది. దీంతో అదే అదునుగా భావించిన అధికారులు పెండింగ్‌లో ఉన్న అనేక పనులను వేగంగా పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. దేశంలో అనేక చోట్ల పెండింగ్‌లో ఉన్న మెయింటెనెన్స్‌ పనులు, యార్డ్‌ మోడలింగ్‌, రిపేర్‌, పాత బ్రిడ్జిల రీ గిర్డెరింగ్‌, డబ్లింగ్‌, విద్యుద్దీకరణ, క్రాస్‌ఓవర్ల ఆధునీకరణ పనులను వారు వేగంగా పూర్తి చేశారు.

కాగా ఆయా ప్రాజెక్టులు, పనులు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వాటిని పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున రైళ్లను ఆపాలని, స్టేషన్లకు ప్రయాణికులు రాకుండా చూడాలని, అందుకనే ఆయా పనులు పెండింగ్‌లో పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చిందని, దీంతో రైలు సర్వీసులు నిలిచిపోగా, ఆయా పనులను తాము చేపట్టామని వారు తెలిపారు. ఇక అందులో భాగంగా మొత్తం 82 బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేశామని, మరో 48 రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలను నిర్మించామని, 16 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేపట్టామని, 14 పాత ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను పూర్తిగా తొలగించామని, 7 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలను లాంచ్‌ చేశామని, 5 యార్డ్‌ రీమోడలింగ్‌ పనులు పూర్తి చేశామని, పలు చోట్ల డబ్లింగ్‌ పనులను, మరో 26 ఇతర ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు.

ఇక మే 21వ తేదీన చెన్నై డివిజన్‌ పరిధిలోని జొలర్‌పెట్టి వద్ద యార్డ్‌ మోడిఫికేషన్‌ పనులు పూర్తయ్యాయి. దీంతో అక్కడ రైళ్లు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు వీలు ఏర్పడింది. అలాగే మే 5న లూధియానాలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని తొలగించారు. దీని పొడవు 135 మీటర్లు. మొత్తం 19 రైల్వే ట్రాక్‌లు, 7 ప్లాట్‌ఫాంలు ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కింద ఉన్నాయి. 2014 నుంచి దీన్ని తొలగిద్దామనుకున్నా వీలు కాలేదు. కానీ లాక్‌డౌన్‌ పుణ్యమా అని ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎట్టకేలకు ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని తొలగించారు.

అలాగే మే 3వ తేదీన మైసూరు డివిజన్‌ పరిధిలోని తుంగ నదిపై ఉన్న బ్రిడ్జిని పునర్నిర్మించారు. ఏప్రిల్‌ 30వ తేదీన ముంబై డివిజన్‌ పరిధిలోని దొంబివలి వద్ద ఉన్న కోపార్‌ రోడ్డు ఆర్‌వోబీని తొలగించారు. ఇలా రైల్వే శాఖ కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news