జనాల ప్రాణాలు తీసే కొత్తరకం వ్యాపారం

-

మీ ఖర్చులకు డబ్బులు కావాలా? అత్యవసరంగా డబ్బు అవసరం ఉందా? మీకు కావాల్సిన డబ్బులు మేమిస్తామంటారు..? ఆఫర్‌ ఏదో బాగుంది కదా అని అప్పు.. తీసుకున్నారో తిప్పలు మొదలైనట్టే.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ పేరుతో యువతను ఉచ్చులోకి లాగుతున్నారు కేటుగాళ్లు. ఈ యాప్ ల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.


తెలుగు రాష్టాల్లో జనాల ప్రాణాలు తీసే కొత్తరకం వ్యాపారం. పబ్జీలు, ఆన్ లైన్ రమ్మీలకంటే అత్యంత ప్రమాదకరమైంది ఈ మనీ యాప్‌ల వ్యాపారం. విద్యార్థులు, నిరుద్యోగులే వీరి టార్గెట్. ఆధార్, పాన్‌ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేస్తారు. వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకూ అప్పు ఇస్తారు.అయితే లోన్‌ ఇవ్వాలంటే పదిమంది ష్యూరిటీ అడుగుతారు. ష్యూరిటీ అంటే వాళ్ల నుంచి సంతకాలు ఏవీ అవసరం లేదు. వాళ్ల కాంటాక్టర్ నంబర్లు ఇస్తే చాలు. సెకన్లలోనే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.లోన్‌లో పది శాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కోత విధించి మిగిలిన మొత్తాన్ని గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఇస్తారు. సులువుగా డబ్బు వస్తుంది కదా? అని విద్యార్థులు, నిరుద్యోగులు యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. తీరా డబ్బులు వెనక్కి చెల్లించడం ఆలస్యమైతే అసలు కథ మొదలవుతుంది.

ఎవరివైతే ష్యూరిటీగా .. ఫోన్ నంబర్లు తీసుకున్నారో వారందరికీ వాట్సాప్ లో మెసేజ్‌లు పంపుతారు ఫలనా వారికి ష్యూరిటీ ఉన్నారు ఆ డబ్బులు వెంటనే కట్టకపోతే మా మనుషులు మీ ఇంటికి వస్తారు.. మీమీద కేసు పెడుతున్నామని, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడుతుందో అన్ని వివరాలతో వాట్సాప్ కు మెసేజ్ పంపుతారు. అంతేగాదు లోన్ ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్ , అడ్రస్‌తో సహా అన్ని వివరాలు పంపుతారు. నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు..అయినా మెసేజ్ వస్తుంది..ఇదో మానసిక వ్యధ.. ఆ కోపంలో మెసేజ్ అందుకున్న వ్యక్తి లోన్ తీసుకున్న వ్యక్తి నంబర్ కు కాల్ చేసి తిడతారు..నా నంబర్ ని మీరు ఎందుకు షూరిటీ పెట్టారు అని..ఇలా పదిమంది ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి పదేపదే కాల్ చేసి విసిగిస్తే లోన్ తీసుకున్న వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది మనీ యాప్‌లు దర్శనమిస్తున్నాయ్‌. మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రుపీ ఇలా చెప్పుకుంటూ పోతే మనీ యాప్‌లు చాంతాడంత ఉన్నాయ్‌. ఇతరులను డబ్బులు అడగడం ఇష్టం లేని వారు ఇలా మనీ యాప్‌లలో లోన్లు తీసుకుంటున్నారు.. కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌ డిటెయిల్స్ ఇస్తే చాలు వెంటనే డబ్బులు అకౌంట్‌లో వేస్తారు. ఇది చాలా గుట్టుగా మైక్రోఫైనాన్స్ మాదిరిగా సాగుతోంది దందా. గ్రామీణ ప్రాంతాలకు ఈ యాప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.

అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈ వేధింపులు భరించ లేకే..విశాఖ జిల్లా గాజువాకలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వాస్తవానికి ఇది చట్ట విరుద్ధమైన వ్యాపారం. కాని వేల కోట్లలో ఈ దందా గుట్టుగా సాగుతోంది. ఇందులో మరి యాప్ నిర్వాహకులకు లాభం ఏంటి అంటే..ఆ యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఆదాయం వస్తుంది అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ముందుగానే తీసుకున్న లోన్ లో డబ్బులు కట్ చేస్తారు. అలాగే.. ఒకటి నుంచి మూడుశాతం వడ్డీవసూలు చేస్తారు.

ఇది చిన్నచిన్న అమౌంట్ లో అనుకున్నప్పటికీ.. పెద్దపెద్దవ్యాపారం జరుగుతుంది… ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో లక్షలమంది విద్యార్థులు, నిరుద్యోగులు చేతి ఖర్చుల కోసం ఇలా ఈ యాప్‌ల నుంచి అప్పులు తీసుకున్నారు.లాక్ డౌన్‌ సమయంలో అవసరాల కోసం ఇబ్బంది పడిన అనేక మంది ఇలాంటి యాప్‌ల బారిన పడ్డారు. ఇదంతా మైండ్ గేమ్ అంటున్నారు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్… జనాల అవసరాలే ఈ యాప్‌లకు పెట్టుబడి అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news