రాజకీయంగా సీనియర్ అయిన మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు కుటుంబంలో ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ప్రస్తుతం బాబు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అరంగే ట్రం చేసిన రామ్‌జీపరిస్థితి ఏంటి? అనేది సందేహంగా మారింది. తన తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి బాబు.. ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీలో చక్రం తిప్పారు. ఇక, గత ఏడాది తప్పనిసరి పరిస్థితిలో పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడు రామ్‌జీని రంగంలోకి దింపాలని ఆయన యోచిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ జిల్లా స్తాయిలో యువ నేతగా రామ్ జీ చక్రం తిప్పుతున్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీకి పెట్టాలంటూ.. ఇప్పటి నుంచి నియోజకవర్గం స్థాయిలో తనకుమారుడిని డెవలప్ చేసుకోవాలని మాగంటి బాబు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిలో ఏలూరు ఎంపీ స్థానం కోసం ప్రయత్నించారు. అయితే , ఇప్పటి వరకు దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదిలావుంటే, ఈలోగా.. ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ఉరఫ్ బుజ్జి మృతి చెం దారు. దీంతో ఏలూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీకి నాయకుడి అవసరం ఏర్పడింది. అక్కడ బాధ్యతలు ప్రస్తుతానికి బుజ్జి సోదరుడికి ఇచ్చారు.
అయితే రామ్‌జీ తాత, నాయనమ్మ, తండ్రి పనిచేసిన దెందులూరుతో పాటు ఏలూరుపైనా రామ్‌జీ దీనిపై కన్నేశారని అంటున్నారు. అంటే.. తన తండ్రి ఎంపీగా పంపాలని అంటుంటే.. రామ్‌జీ మాత్రం ఎమ్మెల్యే స్థానంపై దృష్టి పెట్టారు. ఏలూరు లేదా దెందులూరు నియోజకవర్గాల్లో అయితే తమకు పట్టుందని , యువత ఎక్కువగా ఉందని రామ్‌జీ భావిస్తున్నారు. కానీ, ఇక్కడ నుంచి గతంలో వరుస విజయాలుసాధించి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో వైసీపీ జోరు పెరిగింది. స్థానికంగా కూడా నానికి మంచి పేరు ఉండడంతో మాగంటి బాబు దూర దృష్టితో ఏలూరు ఎంపీ స్థానం అయితే, తన కుమారుడికి బాగుంటుందని భావిస్తున్నారు.
అయితే, ఈ విషయంలో తండ్రీ కొడుకులే ఇలా తర్జన భర్జన పడుతుంటే.. అధిష్టానం మాత్రం మౌనంగా చూస్తోంది. దీంతో ఈ రెండు చోట్లా కూడా టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారని అంటున్నారు. సో.. ఇప్పటికైనా చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్తానికంగా డిమాండ్ వస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.