రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ఏపీ టీడీపీ లోను ఇదే తరహా పరిస్తితి కనిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో తీవ్రంగా ఘోరంగా దెబ్బతిన్న టీడీపీని పట్టా లెక్కించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఒకపక్క ప్రయత్నాలు చేస్తుంటే. మరోపక్క, అధికార పార్టీ నాయకుడు, సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మళ్లీ బాబు జారుబండపై నుంచి కిందికి పడిపోయినంత పనైంది. మూడు రాజధానుల ప్రకటనతో ఏం చేయాలో ఆయన ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మూడు రాజధానులను ఆయన వ్యతిరేకించారు. అయితే, విశాఖలో రాజధాని వస్తే.. ఉత్తరాంధ్ర ప్రజలు కాదంటారా? అయినా బాబు కాదన్నారు.
దీంతో ఇప్పుడు చంద్రబాబు అంటేనే ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు(ప్రధాన మీడి యా ఈ విషయాన్ని ఎంత దాచినా.. సోషల్ మీడియా ఊరుకోదుకదా.. అందుకే అక్కడ ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే) దీంతో విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కూడా టీడీపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చినా.. విశాఖలో రాజధానిని వద్దనే గట్స్ ఎవరికీ లేవు. దీంతో టీడీపీ పరిస్థితి గత ఏడాది ఎన్నికలతో పోల్చుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి చేరింది. ఇక, ఈ పరిణామాలను తట్టుకునేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న శ్రీకాకుళం నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి కళా వెంకట్రావు పార్టీకి అధ్యక్షుడనే పేరే తప్ప.. ఆయన నిమిత్త మాత్రుడు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ తరఫున వాయిస్ వినిపించేనాయకుడు లేరు. పైగా మూడు రాజధానులను ఒక పక్క వద్దంటూనే విశాఖపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అసలు విశాఖను అభివృద్ది చేసిందే తానని చంద్రబాబు ఉద్ఘాటిస్తున్నారు. అంటే.. ఒక పక్క, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూనే.. ఉత్తరాంధ్రను తనకు అనుకూలంగా తిప్పుకోవాలన్నది బాబు వ్యూహం. అయితే, ఈ వ్యూహాన్ని అనుకున్నంత రేంజ్‌లో ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. మరీ ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కూడా ఈవిషయంలో మైనస్ అయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర అది కూడా శ్రీకాకుళానికే చెందిన నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చన్నాయుడు అయితే, గొంతేసుకుని ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడతాడని భావించిన చంద్రబాబు.. ఆయనకు మొత్తంగా రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే.. ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తు న్నారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అంటే.. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడిని తప్పిం చి.. అచ్చన్నకు అప్పగించడం ద్వారా తనకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉందని బాబు చెప్పుకొనేందుకు ఛాన్స్ ఉంటుందని ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.