తాలిబన్ల కబంధ హస్తాల్లో అఫ్గానిస్థాన్ మహిళలు నలిగిపోతున్నారు. స్త్రీల స్వేచ్ఛపై అడుగడుగునా ఉక్కుపాదం మోపుతున్నారు. మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై తాలిబన్లు ఆంక్షలు విధించారు. ఇప్పుడు జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన తర్వాత 2021 ఆగస్టులో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగడుగునా మహిళలపై ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా జిమ్‌లు, పార్కుల్లోకి మహిళలపై నిషేధం ఈ వారం నుంచి అమలులోకి వచ్చినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ అకేబ్ మొహజెర్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా పార్కులు, వ్యాయామ శాలలు (జిమ్)ల్లోకి మహిళలపై నిషేధం విధించకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు ఆయన చెప్పారు. అందుకోసం వారంలో కొన్ని రోజులు మహిళలు, ఇంకొన్ని రోజులు పురుషులను పార్కులు, జిమ్‌లలోకి ప్రవేశం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు తామ ఆదేశాలను ఎవరూ పాటించడంలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో అన్ని పార్కులు, జిమ్‌లలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.