అమెరికాలో మారుతున్న వీసా నిబంధనలు

అమెరికా వీసాలంటే మాములు క్రేజ్‌ ఉండదు. ముఖ్యంగా మన భారతీయులకు హెచ్‌-1బీ వీసా అంటే హాట్‌ కేకు. అయితే ట్రంప్‌ వచ్చిన తర్వాత వీసా నిబంధనల్లో మార్పులు మనోళ్లకు ఇబ్బందికరంగా మారాయి. కానీ ఇప్పుడు హెచ్‌1బీ వీసా జారీలో కొత్త విధానం అమల్లోకి రానుంది. . అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని అంటున్నారు.

అమెరికాలో వీసా నిబంధనలు మారుతున్నాయి. కొత్త విధానంలో హెచ్‌-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నట్లు లాటరీ మాదిరి కాకుండా.. ఇక నుంచి అభ్యర్థుల వేతనాలు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పాత పద్ధతికి బదులుగా కొత్త విధానంలో హెచ్‌-1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అయ్యారు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికారులు.

కొత్త విధానంలో తమ దేశ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని అమెరికా చెబుతోంది. దాంతో పాటు నిపుణులైన విదేశీ సిబ్బందికి కూడా తాత్కాలిక ఉపాధి కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుందని వారంటున్నారు. అధిక సామర్థ్యం, నైపుణ్యం గత సిబ్బందికి తగినట్టుగా అధిక వేతనం అందించే ఈ కొత్త విధానం అందరికీ లాభదాయకమే అన్నది అమెరికా చెబుతున్న మాట. ఈ విధానం 60 రోజుల వరకు అమలులో ఉంటుందని వారు ప్రకటించారు.

ప్రస్తుతమున్న తాత్కాలిక వీసా విధానాన్ని ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో నియమించేందుకు ఉపయోగించటం ద్వారా యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారనేది అధికారుల వాదన. దీనిని అరికట్టేందుకే ఈ సవరణలు చేపట్టామని యూఎస్‌సీఐఎస్ అధికారులు వివరించారు. ఇక భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన లక్షలాది నిపుణులకు అమెరికా కొలువులను అందించే హెచ్‌-1బి వీసా నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1న ప్రారంభం కానుంది.