అమెరికాను మరింత కవ్వించేలా చైనా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. చైనా రక్షణ మంత్రి లీ షెంగ్ఫూ ఆదివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆయన రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చేపట్టిన విదేశీ పర్యటన ఇదే. ఓ వైపు రష్యాతో సంబంధాల విషయంలో బీజింగ్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే ఈ పర్యటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పర్యటనతో పెద్దన్న అమెరికాలో ఆందోళన మొదలైంది.
మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి రష్యా చేరుకోవడం అమెరికా ఆందోళనను పెంచింది. చైనాతో రష్యా సైనిక సంబంధాలను బలోపేతం చేసుకొంటోందని భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఆయుధ సహకారం అందిస్తుందని అనుమానిస్తోంది.
గతంలో షీ జిన్‌పింగ్ పర్యటన చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పుతిన్ పేర్కొన్నారు. సైనిక రంగం సహా అన్ని విభాగాల్లో ఇరు దేశాలు సంబంధాలను బలపర్చుకొంటున్నాయని చెప్పారు. మరోవైపు ఇరు దేశాలు, సైన్యాలు సహకారం ఫలవంతంగా ఉందని లీ షెంగ్ఫూ పేర్కొన్నారు.