ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కానీ యూకే వంటి కొన్ని దేశాల్లో మాత్రం కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గత వారం రోజులుగా బాగా తగ్గుతోంది. అయితే కరోనా తగ్గుతుందని చెప్పి చాలా వరకు దేశాలు లైట్ తీసుకుంటున్నాయని.. కానీ అజాగ్రత్తగా ఉంటే ముప్పు మళ్లీ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ హెచ్చరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ముప్పు తగ్గుతుందని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయని, అందుకనే ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నాయని, అయితే ఇది మంచిదే అయినప్పటికీ అజాగ్రత్తగా ఉంటే కరోనా మళ్లీ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా భారీగా తగ్గిందని, ఇది శుభ పరిణామమని, కరోనాను మనం నియంత్రించగలమని అన్నారు.
కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలమని టెడ్రోస్ అన్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. కాగా భారత్ సహా అనేక దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇక అనేక దేశాల్లో ఇప్పటికే రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది.