గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు.. ట్రంప్‌ సరికొత్త ప్రతిపాదన!

-

అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన విదేశీ విద్యార్థులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదిరిపోయే శుభవార్త చెప్పారు.  గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని ప్రతిపాదించారు. విదేశాల నుంచి ప్రతిభావంతులను పలు కంపెనీలు నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

‘‘కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్‌ కాలేజ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నాను’’ అని ట్రంప్‌ అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన దీనిపై దృష్టి సారిస్తానని తెలిపారు.  ట్రంప్‌ .. సాధారణంగా ఆయన ప్రచార కార్యక్రమాల్లో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news