భారత్‌లో ఎలాన్‌ మస్క్‌ పర్యటన..ప్రధాని మోదీతో సమావేశం!

-

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ నెలలో భారత్‌లో పర్యటించనన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ మేరకు భారత పర్యటన, ప్రధానితో భేటీని ధ్రువీకరిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మస్క్‌ పోస్టు పెట్టారు. మోదీతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే భారత్లో పర్యటన తేదీని మాత్రం ఎలాన్ మస్క్ వెల్లడించలేదు. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని, సుమారు 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.

మరోవైపు దిల్లీలో ఏప్రిల్‌ 22వ తేదీన ప్రధానితో మస్క్‌ భేటీ కానున్నారని సంబంధిత వర్గాల సమాచారం. విద్యుత్‌ కార్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం టెస్లా ప్రతినిధులు భారత్‌లో సందర్శించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ నెలలోనే ఈ పర్యటన ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. మరోవైపు టెస్లా ప్లాంట్‌ను ఆకర్షించేందుకు గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.  మరి ఏ రాష్ట్రంలో టెస్లా అడుగుపెట్టబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news