అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు .. ఐదుగురి మృతి..!

-

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. కొలరాడోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. కొలరాడో స్ప్రింగ్స్‌ శివారులోని ‘క్లబ్‌ క్యూ’లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్‌ లెఫ్టినెంట్ పమేలా కాస్ట్రో మీడియాకు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిపారు.  అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే ఘటనాస్థలాన్ని చుట్టుముట్టారని, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఈ నైట్‌క్లబ్‌ను ప్రత్యేకంగా స్వలింగ సంపర్కుల కోసం నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. తాజా ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇది తమ సమాజంపై జరిగిన ద్వేషపూరిత దాడిగా పేర్కొంది. ఈ ఘటన వెనుక కారణాలు, ఆయుధ వివరాల వంటి సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. గతంలోనూ ఓర్లాండోలోని ఓ స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అక్కడే తుదముట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news