ఇమ్రాన్ ఖాన్.. ఇప్పటికే పాక్ ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. అలాగే అతనిపై విదేశి ఫండ్ విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా గా ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఖజనాలో ఉన్న బంగారు నెక్లెస్ మాయం అయినట్టు తెలుస్తుంది. ఈ బంగారు నెక్లెస్ దాదాపు రూ. 18 కోట్ల విలువ చేసేదని సమాచారం. ఈ బంగారు నెక్లెస్ ను ఇమ్రాన్ ఖాన్.. ఓ ప్రయివేట్ జ్యుయలరీలో విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని పాకిస్థాన్ కు చెందిన ఒక ప్రముఖ పత్రిక కూడా రాసింది. దీంతో పాక్ లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ.. ఈ వ్యవహారంపై విచారణ కూడా ప్రారంభించింది. కాగ పాక్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్న సమయంలో ఈ నెక్లెస్ గిఫ్ట్ గా వచ్చింది. అయితే దీన్ని ఖజనాలో జమ చేయకుండా.. విక్రయించారని తెలిపింది. దాన్ని విక్రయించగా.. వచ్చిన సొమ్ములో సగం మాత్రమే.. ఖజనాలో జమ చేశారని ఆరోపించింది.