శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ఆ దేశ ప్రజల ఆగ్రహానికి గురైన గొటబాయ 50 రోజుల క్రిత విదేశాలకు పారిపోయారు. నెలన్నర తర్వాత ఆయన శుక్రవారం రోజున మళ్లీ శ్రీలంక గడ్డపై అడుగుపెట్టారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయనకు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు రక్షణ వర్గాల సమాచారం.
అధికారం నుంచి గొటబాయ వైదొలగాలని డిమాండ్ చేస్తూ జులైలో అధ్యక్ష భవనం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలు ముట్టడించారు. తదనంతర పరిస్థితుల్లో 73 ఏళ్ల రాజపక్స తొలుత మాల్దీవులకు పరారయ్యారు. అటునుంచి సింగపూర్, చివరిగా థాయ్‌లాండ్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వం 90 రోజులు ఉండేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి రావాలని రాజపక్స నిర్ణయించుకున్నారు. శుక్రవారం థాయ్‌లాండ్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో స్వదేశానికి గొటబాయ చేరుకున్నారు.