దేశాన్ని నడిపే అధ్యక్షుడి కారణంగానే పౌరుల ప్రవర్తన ఆధారిపడి ఉంటుంది అని చెప్పేందుకు ఉదాహరణలు ఉన్నాయి. దేశాన్ని గెలిపించే శక్తుల కారణంగానే పౌరుల నడవడి ఆధారం అయి ఉంటుంది అని చెప్పేందుకు కూడా కొన్ని ఘటనలు ఉన్నాయి. ఈ సారి పొరుగు దేశాన అంటే పశ్చిమ దేశాన అస్థిరం అయిన ఆర్థిక వ్యవస్థ, అనారోగ్య పరిస్థితులు, అభద్రతా భావం రెట్టింపునకు నోచుకుంటున్నాయి. ఆయుధ సంపత్తిని పోగేసుకుని అమ్ముకుని బతకడం తప్ప అగ్ర రాజ్యం మరో విధంగా ఎదుగుదలను కోరుకోవడం లేదా అన్న సందేహాలూ వస్తున్నాయి. ఈ క్రమంలో దుండగుల క్రీనీడలు, దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి.
మహిళలు, చిన్నారులపై కూడా దాడులు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా జనం తిరుగాడే చోట గన్ కల్చర్ పేట్రేగి పోతోంది. మితిమీరిన హింస న్యూయార్క్ లాంటి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న దేశాన ఇప్పుడు వికృత కాండలు పేట్రేగిపోతున్నాయి. నిలువరించాల్సిన తరుణాన రోజుకో ముప్పు వేర్వేరు రూపాలలో పౌర జీవనం పై ప్రభావం చూపుతూనే ఉంది. ఈ దశలో దేశాన్ని భద్రతా రీత్యా పటిష్టం చేయాల్సిన అవసరం అధ్యక్షుడికి ఉంది.
పౌరుల అనుచిత ప్రవర్తన కొన్ని దారుణాలకు కారణం అవుతుంది. పౌరుల దుష్ట సంస్కృతి విధ్వంసాలకు ఆనవాలు అవుతుంది. దుర్బుద్ధిని నిలువరించడం సాధ్యం కాకపోతే కొన్ని సార్లు భయానక వాతావరణం నెలకొంటుంది. అమెరికాలో జరిగిందిదే ! ఆ దేశంలోని న్యూయార్క్ నగరం, బ్రూక్లీన్ లో కాల్పుల కలవరం తీవ్ర సంచలనం అయింది. ఓ దుండగుడి దుశ్చర్య కారణంగా 16 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ కు భద్రతాధికారులు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే…
పాశ్చాత్య నగరిలో ఉన్నపళాన రేగిన కలవరం ఎందరినో భయానికి,ఆందోళనకూ గురిచేసింది. ఎప్పటి నుంచో ఉన్న గన్ కల్చర్ మరో సారి రేపిన అలజడి కారణంగా దేశంలో ఏమౌతుందో అన్న అలజడి తీవ్ర ఆవేదనకు తావిచ్చింది. బ్రూక్లీన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో నిన్నటి వేళ దుండగుడి దుశ్చర్య కారణంగా భద్రతా దళాలు అప్రమత్తం అయిన తీరు బాగున్నా, వీటిని నిలువరించడంలో అవి ఎప్పటికప్పుడు విఫలం అవుతున్నాయన్న విమర్శ అయితే మాత్రం స్థిరం అవుతోంది. ఇప్పటికే అత్యంత అభద్రతా పూర్వక పౌర జీవనం సాగిస్తున్న అమెరికన్లకు, ఇంకా చెప్పాలంటే న్యూయార్క్ సిటిజన్లకు తాజా పరిణామం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల లేని దేశాన ఇప్పుడు కొన్ని విద్రోహ శక్తుల చర్యలు విలయాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. వీటిని నిలువరించడంతోనే దేశ భద్రతా వ్యవస్థపై నమ్మకం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా పౌరుల్లో మునుపటి కన్నా నేర ప్రవృత్తి పెరగడమే ఈ తరహా ఘటనలకు కారణం అని తెలుస్తోంది. అదేవిధంగా అస్తవ్యస్త ఆర్థిక రంగం కారణంగా చాలా మంది నిరుద్యోగ యువత ఇటువంటి విద్రోహ చర్యల వైపు ఆకర్షితులు అవుతున్నారు. పేరు అగ్ర రాజ్యమే అయినా కరోనా కారణంగా ఆర్థికంగా ఛిన్నాభిన్నం అయి ఉంది. దేశాన్ని బలపరిచే స్థిరమయిన నిర్ణయాలు ఏవీ లేవు. యుద్ధ కాంక్ష తప్ప దేశానికి మరొకటి లేదా అన్న విధంగా అధ్యక్షుడి తీరు ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉండడమే కాకుండా అంతర్గతంగా కూడా కొన్ని విద్రోహ శక్తుల అలజడుల కారణంగా భారత సంతతి అతి ఆందోళన చెందుతోంది.