ఇమ్రాన్ ఖాన్ పై దాడి.. భారత్ రియాక్షన్ ఏంటంటే..?

-

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడిన ఘటనపై భారత్ స్పందించింది. పాకిస్థాన్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని తెలిపింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ‘‘పాకిస్థాన్​లో ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఓ కన్నేసి ఉంచాం. అంతేకాకుండా అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం.’’ అని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పుల ఘటనను ఉద్దేశిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు.

దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాంగ్‌మార్చ్‌ పేరిట ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. లాంగ్‌ మార్చ్‌ పంజాబ్​ ప్రావిన్స్​లోని వజీరాబాద్‌లో అల్లాహో చౌక్‌కు చేరుకోగానే ఇమ్రాన్‌ ఖాన్‌ ఓపెన్ టాప్ వాహనంపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్‌ వాహనం పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు పీటీఐ నేత ఫవాద్‌ చౌధురి వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వాహనం నుంచి ఇమ్రాన్‌ను కారులోకి తరలిస్తుండగా ఆయన కుడి కాలికి బ్యాండేజీ ఉన్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. పీటీఐకి చెందిన దాదాపు నలుగురు నాయకులు ఈ కాల్పుల్లో గాయపడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news