ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా తెలుసు కదా. ఈ-కామర్స్ రంగంలో జాక్ మా ఒకప్పుడు పెను సంచలనం. చాలా ఏళ్లుగా ఆయన విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇన్నాళ్లు బిజినెస్మేన్గా రాణించిన జాక్.. తాజాగా ప్రొఫెసర్ అవతారం ఎత్తనున్నారు. అదేంటనుకుంటున్నారా..? నిజమేనండోయ్ బాబు..!
జపాన్‌లోని టోక్యో కళాశాలలో ఆయనను విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించుకున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో సోమవారం ప్రకటించింది. అక్టోబరు వరకు ఆయన సేవలందిస్తారని తెలిపింది. సుస్థిర వ్యవసాయం, ఆహార ఉత్పత్తి మొదలైన అంశాలపై జాక్ పరిశోధన చేస్తారని పేర్కొంది. సాంకేతికతలో, వ్యాపారంలో, కార్పొరేట్ వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవాన్ని విద్యార్థులు, సహచర ప్రొఫెసర్లకు బోధిస్తారని వర్సిటీ వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం చైనా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థల పట్ల ఆయన విమర్శనాత్మకంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశాల్లో తలదాచుకుంటూ ఎక్కడా పెద్దగా కనపడని జాక్ మా.. మళ్లీ ఇటీవలే చైనాలో కనిపించారు.