రష్యా నుంచి ముప్పు పెరుగుతుండడం వల్ల నాటోలో చేరాలని చాలా రోజుల నుంచి ఫిన్లాండ్ యోచిస్తోంది. అయితే మొదటి నుంచి తుర్కియే దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. తాజాగా తుర్కియే కూడా ఆమోదం తెలపడం వల్ల రష్యాతో 13,40 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న ఫిన్లాండ్.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో సభ్య దేశంగా చేరింది. ఈ విషయాన్ని నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్బెర్గ్ అధికారికంగా ప్రకటించి పత్రాలను అందజేశారు.
ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. 1994 నుంచి నాటో భాగస్వామ్య దేశంగా కొనసాగుతున్న ఫిన్లాండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సభ్య దేశంగా అవతరించింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత నాటోలో చేరేందుకు ఫిన్లాండ్ దరఖాస్తు చేసుకుంది.
నాటోలో ఫిన్లాండ్ చేరిక రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నాటోలో ఫిన్లాండ్ చేరిక రష్యాకు భారీ వ్యూహాత్మక ఓటమిగా నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఫిన్లాండ్కు నాటోలో చేరే ఉద్దేశమే లేకపోయినా ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగడం వల్ల.. భద్రతా పరమైన సవాళ్లు పెరగడంతో ఫిన్లాండ్ నాటోలో చేరింది. ఈ చేరికతో రష్యాతో తన సరిహద్దును రెట్టింపు చేసుకుంది.