ఇజ్రాయెల్ – హమాస్ మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు యావత్ పశ్చిమాసియాపై యుద్ఘమేఘాలు ఆవరించేలా చేస్తోంది. ఇటీవల హమాస్, హెజ్‌బొల్లా అగ్రనేతల హత్యలు ప్రపంచాన్నే కుదిపేయడంతో మరో యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కోసం మరోసారి మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈసారి ఎలాంటి సాకులు చెప్పకుండా చర్చలకు రావాలని ఇజ్రాయెల్, హమాస్లకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తేల్చి చెప్పాయి. ఆగస్టు 15న కైరో, ఖతార్, దోహా నగరాల్లో ఎక్కడో ఒక చోట చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విజ్ఞప్తిని ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. మధ్యవర్తిత్వ దేశాలు కోరినట్లుగా ఆగస్టు రెండో వారంలో చర్చలకు వస్తామని వెల్లడించింది. గాజాలో కాల్పుల విరమణ, హమాస్ చెరలోని బందీల విడుదల తప్ప మరే అంశాలు చర్చల్లో ఉండొద్దని మధ్యవర్తిత్వ దేశాలు ఇరు పక్షాలకు సూచించాయి.