పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 670కి పైగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) తెలిపింది. శుక్రవారం (మే 24వ తేదీ) తెల్లవారుజామున ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత 60 ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించిన అధికారులు వంద మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేశారు.
కానీ తాజాగా 150కి పైగా ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయని మృతుల సంఖ్య భారీగా ఉండనుందని ఐవోఎం పేర్కొంది. కొండచరియలు ఇంకా విరిగిపడుతుండటంతో సహాయక చర్యల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా అంతర్జాతీయ మద్దతు తీసుకొనే అంశాన్ని న్యూగినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆదివారం నాటికి అయిదు మృతదేహాలను మాత్రమే సహాయక బృందాలు వెలికితీశారు. ఈ ఘటనలో ఇప్పటికే 670 మందికిపైగా సజీవ సమాధి కాగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుదన్న అధికారుల అంచనా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.