రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి పుతిన్ సర్‌ప్రైజ్ అయితే నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. ఇంతకీ రష్యా నియంతకు ఉత్తర కొరియా డిక్టేటర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
పుతిన్‌కు కిమ్ పంగ్సన్ అనే వేటాడే శునకాలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. పుతిన్, కిమ్ కలిసి తెల్లటి శునకాలను చూస్తున్న వీడియోను ప్రసారం చేసి.. ఇవి ఉత్తర కొరియాలోని ఉత్తర భాగంలో మాత్రమే కనిపిస్తుంటాయని ఈ కథనం పేర్కొంది.
పుతిన్‌కు శునకాలు అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. గతంలో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు అరుదైన కుక్కలను బహూకరించిన సందర్భాలున్నాయి. ఇక పుతిన్ కూడా కిమ్‌కు రెండో ఆరుస్ లిమోసిన్ కారును బహూకరించారు. గతంలో ఒకటి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఒక టీసెట్‌ను కూడా అందజేశారు. ఇరువురు దేశాధినేతలు ఆ కారులో కొద్దిసేపు షికారు చేసిన అనంతరం కిమ్ వద్ద ఉన్న అరుదైన తెల్ల గుర్రాన్ని కూడా పుతిన్ చూశారు.