అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ.. ప్రజలకు పాక్ ప్రధాని ట్వీట్

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు ఆ దేశంలో దయనీయ పరిస్థితులు చోటుచేసుకొంటున్నాయి. ఆ దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం 7.30గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. దీంతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్విటర్‌లో స్పందించారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. తాను ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్‌ వైఫల్యానికి గల కారణాలపై విచారణ జరుగుతోందన్నారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగా నిన్న ఇస్లామాబాద్‌, కరాచీతో పాటు పలు ప్రధాన నగరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం మంగళవారం కూడా అంధకారంలోనే ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరాలో అంతరాయానికిగల కారణాలను తెలుసుకొనేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.